ఓటు బచావో - దేశ్ బచావో: ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పిలుపు
ఓటు బచావో - దేశ్ బచావో: ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పిలుపు.
నవంబర్ 1న ఢిల్లీ రామ్ లీలా మైదానంలో భారీ నిరసన - ఏఐసీసీ పరిశీలకులు రవీందర్ దాస్, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి...
*మహబూబ్ నగర్ సిటీ, అక్టోబర్ 27:*
ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ బలోపేతం, ప్రజల ఓటు హక్కును కాపాడడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మూడో దశ ఉద్యమం 'ఓటు బచావో - దేశ్ బచావో' ప్రచారాన్ని చేపడుతోందని ఏఐసీసీ పరిశీలకులు రవీందర్ దాస్, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
సోమవారం మహబూబ్ నగర్ నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
గతంలో మొదటి దశలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆందోళనలు, రెండో దశలో దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలు చేపట్టామని, ప్రస్తుతం మూడో దశలో భాగంగా ఓటర్ల హక్కుల పరిరక్షణే ప్రధాన అజెండాగా ప్రజల్లోకి వెళ్తున్నామని పేర్కొన్నారు.
ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాల నిర్వహణలో చోటుచేసుకుంటున్న మార్పులు, పేర్ల తొలగింపులు, చేర్పులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు, బూత్ స్థాయి ఏజెంట్లు ప్రతి నియోజకవర్గంలోని ప్రతి బూత్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాలను పరిశీలిస్తారని చెప్పారు.
ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అనంతరం ఓటర్ల జాబితాల్లో జరిగిన మార్పులు, ఫారం-6, ఫారం-7 దరఖాస్తుల వివరాలను సేకరిస్తామన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడినట్లు గుర్తిస్తే, నిబంధనల ప్రకారం తిరిగి చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ప్రతి బూత్ నుంచి సేకరించిన సమాచారాన్ని DCC ద్వారా PCC కి, అక్కడి నుంచి ఏఐసీసీ కేంద్ర నియంత్రణ విభాగానికి పంపిస్తామని వివరించారు.
ఓటు హక్కు పరిరక్షణ, ప్రజాస్వామ్య బలోపేతం కోసం నవంబర్ 1న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి, ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు.
రాహుల్ గాంధీ గతంలోనే ఓటర్ల జాబితాల్లో పేర్ల పునరావృతం, అర్హుల తొలగింపు వంటి అంశాలపై ఆధారాలతో దేశ ప్రజల దృష్టికి తీసుకువచ్చారని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అజ్మత్ అలీ తదితరులు పాల్గొన్నారు.